Saturday, 3 February 2018

జయహో 'యువ భారత' క్రికెట్‌ చాణక్య!

జయహో 'యువ భారత' క్రికెట్‌ చాణక్య!


అతడే ఒకప్పుడు అపజయాలకు అడ్డుగోడ. ఇప్పుడు భవిష్యత్తు విజయాల నిర్మాత. అతడే ఒక సైన్యం. రేపటి స్టార్‌ క్రికెటర్లను చెక్కుతున్న జక్కన్న. అతడే ఒక ధైర్యం. ఇక ఏం జరగదులే అన్న స్థైర్యానిచ్చే శిక్షకుడు. అతను పైకొక సాధారణ క్రికెటర్‌. మైదానంలో మాత్రం అసాధారణ పోరాట యోధుడు. అప్పటి ఆ ఆటగాడే భవిష్యత్తు భారత క్రికెట్‌ చాణక్యుడు. నవ భారత యువ క్రికెటర్లను పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతున్న స్థిత ప్రజ్ఞుడు. ఐసీసీ అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ను నాలుగోసారి దేశానికి అందించిన మేటి గురువు. అప్పటికీ.. ఇప్పటికీ..

మరెప్పటికీ ఆయన 'మిస్టర్‌ డిపెండబుల్‌'!
వెలకట్టలేని అనుభవం
మునుపటి తరం క్రికెటర్లలో పరిపూర్ణుడు ఎవరంటే వినిపించే పేర్లలో రాహుల్‌ ద్రవిడ్‌ పేరు ముందుంటుంది. ఆయనకున్న క్రికెట్‌ పరిజ్ఞానం అమోఘం. ఆ అనుభవం అపూర్వం.

ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాలపై ఆయన ఆడిన ఇన్నింగ్స్‌లను మనం ఇప్పటికీ మరిచిపోలేం. విదేశాల్లో పేస్‌, బౌన్సీ పిచ్‌లపై టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలిన ప్రతి సందర్భంలోనూ నేనున్నా! అంటూ క్రీజులో నిలిచారు. ఆత్మవిశ్వాసంతో పోరాడారు.

తన డిఫెన్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను అసహనానికి గురిచేసేవారు. వారిని అలసిపోయేంత వరకు పరుగెత్తించి ఆపై తాను పరుగు మీద పరుగు సాధించి చివరికి అపజయాన్ని ఓడించేవారు. సంప్రదాయ క్రికెట్‌లో ద్రవిడ్‌కు తెలియని షాట్లు లేవంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు! గెలిస్తే పొంగిపోరు.

అపజయాలకు కుంగిపోరు. ఆటలో ఇవన్నీ సహజం అన్నట్టు ప్రశాంతంగా ఉండేవారు. ఆ గుణాలే ఇప్పుడు యువ భారత క్రికెటర్లను పరిపూర్ణంగా గుణాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతున్నాయి.
నియమాల్లో కఠినం
శిష్యులపై గురువుకు అవ్యాజమైన ప్రేమ ఉండాలి.

సరిదిద్దాల్సి వచ్చినప్పుడు దండన విధించేందుకూ వెనకాడొద్దు. అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గా ద్రవిడ్‌ ఈ నిబంధనలను పక్కాగా అమలు చేస్తారని వినికిడి. పేలవమైన షాట్లు ఆడి ఔటైనప్పుడు ఆ పొరపాట్లను ఎలా సరిద్దుకోవాలో చెప్పేవారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే మాత్రం అస్సలు సహించరు.

శిక్షణలో ఎంత సరదాగా వ్యవహరిస్తారో అవసరమైతే అంతే తీవ్రత ప్రదర్శిస్తారు. స్వేచ్ఛను సైతం అలాగే ఇస్తారు. అండర్‌-19 ప్రపంచకప్‌ జరుగుతున్న సమయంలోనే కుర్రాళ్లు ఐపీఎల్‌ వేలం గురించి ఆందోళన పడుతున్నప్పుడు హితోపదేశం చేశారు. 'మీరిప్పుడు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి.

వేలం గురించి అస్సలు ఆందోళన చెందకండి. ఇప్పుడు మీరు చక్కగా రాణిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఐపీఎల్‌ వేలాలు మరెన్నో వస్తాయి' అని విడమర్చి చెప్పారు. వారి మనసు తేలిక చేశారు. ఇక ఆస్ట్రేలియాతో తుదిపోరుకు ముందు అనవసర విషయాలు తెలుసుకోకుండా, ఆర్భాట పడకుండా, ఆత్రుతకు లోనుకాకుండా ఉండేందుకు కుర్రాళ్ల చేత మొబైల్‌ ఫోన్లు స్విచాఫ్‌ చేయించారు.
వ్యక్తిత్వ వికాస గురువు
ఆటలో శిక్షణనిస్తేనే గురువు పని అయిపోదు. తన విద్యార్థిని మానసికంగా, శారీరకంగా దృఢంగా రూపొందించాల్సిన బాధ్యత ఆయనదే. ద్రవిడ్‌ దీన్ని తు.చ. తప్పకుండా పాటించారు.

ఒక మ్యాచ్‌లో కుర్రాళ్లు చేసే తప్పుల్ని క్షుణ్ణంగా పరిశీలించేవారు. ఆట ముగిసిన తర్వాత వారిని కూర్చోబెట్టి ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలో విశ్లేషించి చెప్పేవారు. అలాగే ఆటకు మానసికంగా ఎలా సిద్ధమవ్వాలో వివరించేవారు. ఈ రోజు టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకున్న యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య..

ద్రవిడ్‌ చేతిలో పడ్డాకే మెరుగుయ్యాడు. పాండ్య సాధారణంగానే మైదానంలో కాస్త అతిగా భావోద్వేగాలు ప్రదర్శిస్తాడు. కొన్నిసార్లు పిచ్చి ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే భారత్‌-ఏ జట్టు తరఫున ఆస్ట్రేలియాలో పర్యటించిన తర్వాత అతడి దృక్కోణమే మారిపోయింది.

వైవిధ్యంగా బంతులు వేస్తున్నాడు. బ్యాటుతో స్థిరంగా రాణిస్తున్నాడు. తీవ్ర భావోద్వేగాలను అదుపులోకి తెచ్చుకున్నాడు. ద్రవిడ్‌ వల్లే తన ఆటపై నియంత్రణ సాధించానని పాండ్యనే స్వయంగా ఎన్నో సార్లు మీడియాకు చెప్పాడు.

ఈ తరహాలోనే ద్రవిడ్‌ కుర్రాళ్లకు ఎంతో చక్కని శిక్షణ ఇచ్చారు.
గౌరవనీయుడు
ఈ ప్రపంచంలో క్రికెట్‌ ఆడే ఏ దేశానికి వెళ్లినా రాహుల్‌ ద్రవిడ్‌ను గౌరవించని వారు కనిపించరు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ సంఘటనలు మనకు కనిపిస్తాయి. అక్కడి ఆటగాళ్లు ద్రవిడ్‌ను చాలా గౌరవిస్తారు.

ఆయన సలహాలు పాటిస్తారు. తన ప్రశాంత చిత్తంతో.. వ్యవహార శైలితో.. వివాదాలకు దూరంగా ఉండే మనస్తత్వంతో ద్రవిడ్‌ అజాత శత్రువుగా అందరికీ మిత్రుడుగా మారారు.

బీసీసీఐ ద్రవిడ్‌ను అండర్‌-19 కోచ్‌గా ప్రకటించగానే దాయాది దేశం పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. అలాంటి విశ్వసనీయ వ్యక్తులను యువ క్రికెటర్లకు శిక్షకులుగా నియమించాలని పీసీబీని డిమాండ్‌ చేశారు. ఇక అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా చేతిలో పాక్‌ చిత్తుగా ఓడిపోయినప్పుడు ఆ దేశ పౌరులు చేసిన వ్యాఖ్యలు ఎంతైనా హర్షణీయం. 'ద్రవిడ్‌ వంటి గురువు తమకు లేకపోవడంతోనే మా కుర్రాళ్లు ఓడిపోయారు' అని పాక్‌ అభిమానులు ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఆదర్శనీయుడు
'నీ మిత్రులెవరో చెప్పు నువ్వెలాంటి వాడివో చెప్తా' అన్న నానుడిని ఎన్నోసార్లు వినే ఉంటాం. అలాగే ఎంచుకున్న గురువును బట్టి విద్యార్థి విజయవంతం అవుతాడో తేదో చెప్పొచ్చు! గురువు అన్నింటా ప్రతిభాశాలి అయ్యుండాలి. అంతులేని..

అవసరమైన విజ్ఞానాన్ని పంచాలి. విద్యార్థిని ప్రశంసిస్తూ మరింత బాగా ఆడేలా ప్రోత్సహించాలి. పొగడ్తలకు పొంగిపోకుండా అతివిశ్వాసం దరి చేరకుండా చూడాలి. వివాదాలకు దూరంగా ఉంటూ ఆదర్శనీయుడిగా ఉండాలి.

ఈ లక్షణాలన్నీ ద్రవిడ్‌కు ఉన్నాయి. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో తనపై ఒక్క విమర్శ వినిపించిందో లేదో వెంటనే దిల్లీ డేర్‌డెవిల్స్‌తో కోట్ల రూపాయల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. కేవలం కోచ్‌ పదవికే పరిమితమై ఆదర్శంగా నిలిచారు. తన గౌరవాన్ని మరింత పెంచుకున్నారు.

అందుకే ఇలాంటి గురువు దొరికిన పృథ్వీషా సారథ్యంలోని కుర్రాళ్లు అదృష్టవంతులనే చెప్పాలి! కెరీర్‌లో ఎన్నో విజయాలు, ప్రశంసలు, పురస్కారాలు దక్కించుకున్న ద్రవిడ్‌కు ప్రపంచకప్‌ అందుకోలేకపోయాననే లోటు ఉండేది! ఇప్పుడు కుర్రాళ్లు ఆ లోటు తీర్చేశారు. కాదు కాదు తీర్చేసేలా వారికి తర్ఫీదునిచ్చారు.

అందుకే ఈ విజయం గురువుగా ద్రవిడ్‌కు అంకితమని చెప్పడంలో అతిశయోక్తి లేదు!!

No comments:

Post a Comment