Friday, 2 February 2018

అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్ర సృష్టిస్తారా

అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్ర సృష్టిస్తారా

- టైటిల్‌కై ఆస్ట్రేలియాతో ఢీ
- ఉదయం 6.30 గం||ల నుంచి 
- అప్రతిహత విజోరుమీదున్న టీమిండియా యువజట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ సాధిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రూప్‌ దశలో ముఖాముఖి తలపడి ఆసీస్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది. అంతేగాక టీమిండియా జట్టు విజయాలన్నీ భారీ విజయాలే... కోచ్‌ ద్రావిడ్‌ పర్యవేక్షణ... పృథ్వీ షా సారథ్యంలోని యువజట్టు టైటిల్‌ సాధించాలని కోరుకుంటూ...
మౌంట్‌ మౌఘనై (న్యూజిలాండ్‌) : అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో నేడు భారత యువజట్టు టైటిల్‌కై పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. గ్రూప్‌-బిలో ఆసీస్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్‌ ఎడ్వర్డ్‌ను నియంత్రిస్తే భారీ స్కోర్‌ సాధించే అవకాశం ఉండదు. టీమిండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా... అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది.
22 రోజుల పాటుసాగిన యువ ప్రపంచకప్‌ పోరు నేటి ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది. ఇప్పటికే మూడుసార్లు ట్రోఫీని గెలచుకున్న టీమిండియా గత టోర్నీలో ఫైనల్లో బోల్తా పడి ఈసారి ఎలాగైనా కప్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ పర్యవేక్షణలోని భారత్‌ జట్టు తన జైత్రయాత్రను ఫైనల్లో కూడా కొనసాగించి కప్‌ను సొంతం చేసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. 2000లో మొహ్మద్‌ కైఫ్‌ సారథ్యంలో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది... అనంతరం 2008లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో... 2012లో ఉన్ముక్త్‌ చంద్‌ కెప్టెన్సీలో భారత్‌ మరో రెండుసార్లు ప్రపంచకప్‌లను అందుకుంది.
అయితే అండర్‌-19 వరల్డ్‌ కప్‌ చరిత్రలో అత్యధికసార్లు ప్రపంచకప్‌లు గెలిచిన ఘనత భారత్‌-ఆసీస్‌లది. ఈ రెండు జట్లు తలా మూడేసిసార్లు ప్రపంచకప్‌లను గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఫలితంగా ఈసారి ఏ జట్టు గెలిచినా కొత్త చరిత్ర లిఖిస్తుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఇరు జట్లు బలంగా ఉండటంతో మెగా పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత బ్యాటింగ్‌ విభాగంలో సారథి పృథ్వీ షాతో పాటు ఓపెనర్‌ శుబ్‌మాన్‌ గిల్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. మరొకవైపు మన్‌జోత్‌ కర్లా, అభిషేక్‌ శర్మలు కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఇక భారత బౌలింగ్‌ విభాగంలో శివం మావి, కమలేష్‌ నాగర్‌కోటిలు తమ పేస్‌ బౌలింగ్‌తో దుమ్మురేపుతున్నారు. ఇక స్పిన్‌ విభాగంలో అనుకుల్‌ రారు జట్టు అవసరానికి తగ్గట్టు బౌలింగ్‌ చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టే టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. మరి భారత యువ జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచి కొత్త చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి.
శుభమన్‌ గిల్‌ రికార్డ్‌... 
ఫైనల్‌ పోరులో ఇద్దరు ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంది. టీమిండియా తరఫున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ ఒకడు. మరొకరు ఆస్ట్రేలియా జట్టు లెగ్‌స్పిన్నర్‌ లాయిడ్‌ పోప్‌. గిల్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో 170 సగటుతో విజృంభించి రికార్డు పరుగులు సాధిస్తున్నాడు. చివరి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 113.28 స్ట్రైక్‌రేట్‌తో 341 పరుగులు చేశాడు. అంతేగాక టాప్‌ స్కోరర్‌గా కూడా నిలిచాడు. రెండు మ్యాచుల్లో అతడు నాటౌట్‌గానే నిలవడం గమనార్హం. ఇక పాక్‌పై ఒకవైపు వికెట్లు పడుతున్నా 94 బంతుల్లోనే 102 పరుగులతో అజేయంగా నిలిచి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. మిగతా మ్యాచుల్లో 63, 90(నాటౌట్‌), 86తో నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టులో లెగ్‌స్పిన్నర్‌ లాయిడ్‌ పోప్‌ ఆట ఆసక్తికరం. ఇంగ్లాండ్‌తో క్వార్టర్‌లో ఆసీస్‌ 127 పరుగులకే పరిమితమైంది. అయితే బౌలింగ్‌లో పోప్‌ 35 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 96కు కుప్పకూల్చాడు. టోర్నీలో ఇప్పటి వరకు 11 వికెట్లు తీశాడు. తుదిపోరులో ఇతడి ఆట కీలకం కానుంది.
రెండు జట్లూ సమవుజ్జీలే 
అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌, ఆస్ట్రేలియాలు దాదాపు సమవుజ్జీలే! కాస్త భారత్‌దే పైచేయి అయినప్పటికీ... ఈ రెండు జట్లు తలో మూడు సార్లు ప్రపంచకప్‌లను సొంతం చేసుకున్నాయి. 1988, 2002, 2010లో ఆసీస్‌ విశ్వవిజేతగా నిలిచిన జట్లలో స్ట్టువర్ట్‌ లా, జార్జ్‌ బెయిలీ, షాన్‌ మార్ష్‌ వంటి ఆటగాళ్లు ఆ టోర్నీల్లో ఆడారు. భారత్‌ 2000, 2008, 2012లో టైటిళ్ళు సాధించిన జట్టులో యువరాజ్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీలు ఆ తర్వాత ప్రపంచ క్రికెట్‌లో తమదైన ముద్రవేసుకున్నారు. 2016లో వెస్టిండీస్‌ చేతితో తృటిలో ఓడిపోయింది కానీ లేదంటే టీమిండియా అప్పుడే నాలుగోసారి విజేతగా నిలిచేది.
భారతజట్టు : పృథ్వీషా (సారథి), శుభ్‌మన్‌ గిల్‌, మన్‌జోత్‌ కార్లా, హిమాన్షు రాణా, అభిషేక్‌ వర్మ, రియాన్‌ పరాగ్‌, హార్విక్‌ దేశారు, శివమ్‌ మావి, కమలేశ్‌ నాగర్‌ కోటి, ఇషాన్‌ పోరెల్‌, అనుకుల్‌ రారు, శివ సింగ్‌, ఆర్యన్‌ జుయల్‌, అర్షదీప్‌ సింగ్‌, పంకజ్‌ యాదవ్‌
ఆస్ట్రేలియా జట్టు : జేసన్‌ సంఘా (సారథి), విల్‌ సుథర్‌లాండ్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మ్యాక్స్‌ బ్రయంత్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌, జాక్‌ ఇవాన్స్‌, జరాడ్‌ ఫ్రీమ్యాన్‌, రేయాన్‌ హెడ్లీ, బక్సర్‌, నేథన్‌ మ్యాక్‌ స్వీనీ, జొనాథన్‌ మెర్లో, లాయిడ్‌ పోప్‌, పరమ్‌ ఉప్పల్‌, ఆస్టిన్‌ వా.

No comments:

Post a Comment